Total Pageviews

Wednesday, February 12, 2014

బాబావారు యిచ్చిన లాకెట్లు సేకరణ http://www.telugublogofshirdisai.blogspot.in/2014/02/blog-post_10.html

బాబావారు యిచ్చిన లాకెట్లు
నాపేరు మీనాక్షి కటోచ్. ఎన్నో సంవత్సరాలనుండి నేను సాయిని పూజిస్తూ ఉన్నాను. రోజులు గడిచే కొద్దీ బాబా నాకు దగ్గరగానే ఉన్నారనే భావన నాలో కలిగింది. సాయి తప్ప నాకింకే దైవం లేదు. సాయే నాకు తండ్రి, స్నేహితుడు, గురువు, దైవం సర్వస్వం ఆయనే. నేను బాబాతో దెబ్బలాడతాను కూడా. బాబా నాకోపాన్నీ, ఆయనయందు నాప్రేమనీ అర్ధం చేసుకొంటారు. ఈమధ్యనే జరిగిన ఒక అద్భుతాన్ని మీకు వివరిస్తాను.
నామెడలో ఎప్పుడూ సాయి లాకెట్ ఉంటుంది. అది నామెడలో ఉండటంవల్ల బాబా నాకు రక్షణగా, నాకు తోడుగా ఉన్నారనే భావన నాలో ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. ఒక రోజున స్నానం చేస్తూ ఉండగా నాకు తెలియకుండానే ఆ లాకెట్ ఎక్కడకో జారిపోయింది. లాకెట్ పోవడం నాకెంతో బాధ కలిగించింది. ఇల్లాంతా వెతికాను కాని ఎక్కడా కనపడలేదు. లాకెట్ దొరకకపోవడంతో నాకు దఃఖం ఆగలేదు. అప్పుడే నాదగ్గిర మరొక సాయి లాకెట్ ఉందన్న విషయం గుర్తుకు వచ్చి దానికోసం వెతికాను. కాని అదికూడా కనపడలేదు. కళ్ళవెంట నీరు కారుతుండగా బాబా ఫోటో దగ్గరకు వెళ్ళి "బాబా, నాదగ్గిరున్న రెండు లాకెట్ లు కనిపించకుండా పోయాయి. నువ్వే నాకు మరొక బాబా లాకెట్ ను యిప్పించు" అని వేడుకొన్నాను. తరువాత నేను మా అమ్మమ్మగారి గదిలోకి వచ్చాను. అక్కడ మా అత్త తన పాత పర్సులో దేనికోసమే వెతుకుతూ ఉంది. అకస్మాత్తుగా ఆమె "మీనాక్షీ, నా పర్సులో రెండు సాయిబాబా లాకెట్ లు ఉన్నాయి. నీకు కావాలా" అని అడిగింది. నాకు వళ్ళు జలదరించింది. నాకెంతో సంతోషం కలిగింది. నా ఆనందానికి అవధులు లేవు. బాబా నాకోరికని అంత తొందరగా తీర్చారంటే నన్ను నేనే నమ్మలేకపోయాను. నేను రెండు సాయి లాకెట్ లను పోగొట్టుకుంటే బాబా మళ్ళీ నాకు రెండు లాకెట్ లను ఇచ్చారు. ఒకటి మెడలో వేసుకొని మరొకటి నా పర్సులో పెట్టుకొన్నాను.
కొంతమందికి ఇది కేవలం కాకాతాళీయం గా జరిగిందని అనిపించవచ్చు. కాని నాకు మాత్రం యిది ఒక అధ్భుతం. కాని బాబా శక్తి ఎటువంటిదో తెలిసినవారికి, నాకు మరలా రెండు లాకెట్లు లభించడం బాబా వారి అద్భుతమైన లీలేనని నన్ను సమర్ధిస్తారు. ఎవరయితే బాబాను ప్రేమతో మన్స్పూర్తిగా పిలుస్తారో ఆయన మన పిలుపుకి ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే స్పందిస్తారు. నీ భక్తులు పిలిచిన వెంటనె నీవు స్పందించి వారికి సహాయం చేస్తున్నందుకు, బాబా నీకెంతో కృతజ్ఞురాలిని.
జై సాయిరాం..అల్లా మాలిక్
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

0 comments:

Post a Comment